న్యూఢిల్లీ, మే 7: మొదటి రెండు దశల్లో పోలింగ్ శాతంలో వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. పోలింగ్ రోజు ఇచ్చిన రిపోర్టుకు, కొన్ని రోజులకు వెల్లడించిన తుది రిపోర్టుకు పోలింగ్ శాతం భారీగా పెరిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ఈ లేఖలో పేర్కొన్నారు. మొదటి రెండు విడతల్లోనూ ఇదే జరిగిందని తెలిపారు.
ఈ రెండు విడతలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్య, ఓటు వేసిన వారి సంఖ్య, వినియోగించిన ఈవీఎంలు ఎన్ని, వంటి అన్ని వివరాలను ప్రజల ముందుంచాలని ఈసీని కోరారు. ఓటింగ్ శాతంలో వ్యత్యాసంపై మే 1న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అనుమానాలు లేవనెత్తారు.
పోలింగ్ పూర్తి కాగానే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతం కంటే, తుది నివేదికలో 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఆమె పేర్కొన్నారు. బీజేపీకి తక్కువ ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం పెరిగిందని ఆమె అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అందరూ గొంతెత్తాలి: ఖర్గే
ఈసీ విడుదల చేసిన పోలింగ్ శాతంలో వ్యత్యాసాలపై గొంతెత్తాలని కోరుతూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. మొదటి రెండు దశల్లోని పోలింగ్ సరళి చూశాక ప్రధాని మోదీ, బీజేపీలో కంగారు, నిరాశ కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడుకునేందుకు పోలింగ్ శాతంలో వ్యత్యాసాలపై కలిసికట్టుగా గొంతెత్తాలని ఆయన కోరారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతతో పనిచేసేలా చేయడం కోసం ఇండియా కూటమిలోని అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తొలి రెండు దశల్లో వ్యత్యాసాలు
తొలి దశ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న జరిగాయి. ఆ రోజు రాత్రి 7 గంటల నాటికి దాదాపు 60 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అయితే 11 రోజుల తర్వాత ఏప్రిల్ 30న వెల్లడించిన తుది నివేదికలో మాత్రం 66.14 శాతం పోలింగ్ నమోదైనట్టు పేర్కొన్నది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగగా, రాత్రి 7 గంటల నాటికి 60.96 పోలింగ్ జరిగిందని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 30న తుది నివేదికలో మాత్రం 66.7 శాతం నమోదైనట్టు వెల్లడించింది. ముందు వెల్లడించిన శాతానికి, తుది నివేదికలో వెల్లడించిన పోలింగ్ శాతానికి ఇంత వ్యత్సాసం ఉండటంపై ఇప్పుడు ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.