ముంబై, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ షిండేను కోరారు. గత శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహారాష్ట్రలో ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్నదానిపై సందిగ్ధత నెలకొన్నది. ఓవైపు బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో తమ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. మరోవైపు.. షిండే నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొందినందున ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన కార్యకర్తలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరవుతారన్న దానిపై బుధవారం ఉదయానికల్లా ఓ స్పష్టత వస్తుందని శివసేన ప్రతినిధి సంజయ్ శిర్సత్ తెలిపారు. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్ర నాయకులు అమిత్‌షా తదితరులతో ఫడ్నవీస్, షిండే, అజిత్‌పవార్ చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. షిండేనే సీఎంగా కొనసాగించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని, అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారో తనకు అవగాహన లేదని అన్నారు. ఫడ్నవీస్‌నే మూడోసారి సీఎం గద్దెపై కూర్చోబెట్టాలని బీజేపీ భావిస్తున్నదని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠావలే చెప్పారు. అయితే దీనిని బీజేపీ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు.
రెండు రోజుల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి వస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసి ఏక్నాథ్ షిండేను కేంద్రమంత్రిగా, ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండేను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేస్తారని ప్రచారం జరుగుతున్నది. మరొక ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఫార్ములా ద్వారా మూడు పార్టీలనూ ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అంటున్నారు. ఇది షిండే గౌరవాన్ని తకువ చేయదని, ఈ విషయం తేలికగా పరిషారమవుతుందని బీజేపీ భావిస్తున్నది. అయితే షిండే ముఖ్యమంత్రి కావాలని శివసేన నేతలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారని కూడా చెబుతున్నారు.