Frailty | న్యూఢిల్లీ: వృద్ధాప్యం గురించి వ్యతిరేక ధోరణి, ఒంటరినైపోయానని, వృద్ధాప్యం ముంచుకొస్తున్నదనే భావనలు దుర్బలత్వం (ఫ్రెయిలిటీ)కి ప్రారంభ సంకేతాలని పరిశోధకులు చెప్తున్నారు. ఈ ఆలోచనల ప్రభావం 40 ఏళ్ల వయసు గలవారిపై సైతం పడుతుందని చెప్తున్నారు.
ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయంలోని కేరింగ్ ఫ్యూచర్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ దుర్బలత్వం వృద్ధి చెందకుండా నిరోధించవచ్చునని చెప్తున్నారు. పరిశోధక బృందంలోని బ్రెన్నన్ మాట్లాడుతూ, వయసు చాలా ఎక్కువగా ఉన్నపుడు మాత్రమే బలహీనత, నిస్సత్తువ, దుర్బలత్వం వస్తాయని చాలా మంది అనుకుంటారని…కానీ ముసలితనం వాస్తవంగా రావడానికి కొన్ని దశాబ్దాల ముందే మానసిక, ప్రవర్తన పరమైన హెచ్చరిక సంకేతాలు వస్తాయని తమ పరిశోధనలో వెల్లడైందన్నారు.
నలభైలు, ఏభైలు, అరవై ఏండ్ల వయసులో కూడా ఇటువంటి సంకేతాలు రావచ్చునని తెలిపారు. 40 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గల 321 మంది ఆస్ట్రేలియన్ల సమాచారాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. వీరిలో 5 శాతం మంది నిస్సత్తువ (ఫ్రెయిల్)గా ఉన్నట్లు నిర్ధరణ అయింది. వైద్యపరంగా నిస్సత్తువగా ఉన్నట్లు నిర్ధరించడానికి ముందు దశ (ప్రీ-ఫ్రెయిల్)లో 60 శాతం మంది ఉన్నారు. 35 శాతం మంది దుర్బలంగా లేరు (నాన్-ఫ్రెయిల్) అని తేలింది.