‘టెక్‌ఫాగ్’పై దర్యాప్తు

- ఆదేశించాలంటూ సుప్రీంకోర్టుకు ఎడిటర్స్ గిల్డ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జనవరి 11: సోషల్ మీడియాలో విద్వేష ప్రచారానికి కారణమవుతున్న బీజేపీ సామాజిక వేగు ‘టెక్‌ఫాగ్’ యాప్‌పై దర్యాప్తునకు ఆదేశించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ) సుప్రీంకోర్టును మంగళవారం కోరింది. సామాజిక మాధ్యమాల్లో మహిళా జర్నలిస్టులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులు, వ్యవస్థీకృత ట్రోలింగ్‌ను ఈ సందర్భంగా ఖండించింది. కేంద్రంలోని అధికార పార్టీ చర్యలను ప్రశ్నించే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొనే ఈ దాడులు జరుగుతున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను కించపరిచేలా వేలాది ట్వీట్లు పోస్ట్ అవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రశ్నించే గొంతుకలను నొక్కి ఉంచే ప్రక్రియలో ఇది భాగమని పేర్కొన్నది. ప్రజాస్వామ్య సూత్రాలను ఈ చర్యలు అపహాస్యం చేస్తున్నాయని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత ట్రోలింగ్‌కు, వేధింపులకు గురవుతున్నారో.. ‘ది వైర్’ ఇటీవలి పరిశోధన కథనం ద్వారా వెల్లడైందని గుర్తుచేసింది. జర్నలిస్టులు స్వతంత్రంగా తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చకుండా ‘టెక్‌ఫాగ్’ వారిలో భయాందోళనలను కలుగజేస్తున్నదని ఆరోపించింది. ‘టెక్‌ఫాగ్’ యాప్ వెనుక అధికార బీజేపీలోని కొందరు కీలక వ్యక్తులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయని ఈజీఐ పేర్కొంది. దీనిపై అత్యున్నత ధర్మాసనం వెంటనే దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.
అరెస్టులు మాత్రమే సరిపోవు
ముస్లిం మహిళలు విక్రయానికి ఉన్నట్టు ‘బుల్లీ బాయ్’, ‘సల్లీ డీల్స్’ వంటి యాప్‌లలో ప్రకటనలు పోస్టు చేయడంపై కూడా ఈజీఐ స్పందించింది. ఈ జాబితాలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారని పేర్కొంది. ఈ యాప్‌ల రూపకర్తలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని, అయితే అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం కాబోదని తెలిపింది. ఇలాంటి యాప్‌లను సృష్టించడానికి ప్రోత్సహించిన అసలైన నేరస్తులను చట్టం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేసింది. మహిళలపై విద్వేషాన్ని రెచ్చగొడుతూ వారిని కించపరిచే డిజిటల్ మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని, ఆయా ప్లాట్‌ఫాంలను నిషేధించాలని ఈజీఐ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

