న్యూఢిల్లీ: బైజూస్ సీఈవో(Byjus CEO) రవీంద్రన్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసు జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది. బైజూస్ విద్యా సంస్థ సీఈవో దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చర్యలు తీసుకుంటోంది. బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థకు గత ఏడాది నవంబర్‌లో షోకాజు నోటీసులు జారీ చేశారు.
ఫెమా ఉల్లంఘనల కింద రవీంద్రన్‌కు కూడా ఫిర్యాదు ఇచ్చారు. సుమారు 9362 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు రవీంద్రన్‌పై ఆరోపణలు ఉన్నాయి. రవీంద్రన్ కోసం ఎల్ఓసీ ఓపెన్ చేసినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఫెమా చట్టాలకు వ్యతిరేకంగా విదేశాలకు డబ్బును పంపించారని, దాని వల్ల కేంద్ర సర్కారుకు రెవన్యూ నష్టం జరిగినట్లు ఈడీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు కంపెనీపై గత ఏడాది ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈడీ సోదాలు చేసింది. రవీంద్రన్ ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. పెట్టుబడులకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ సమయంలో రవీంద్రన్తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు.