న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న ఆప్ సీనియర్ నేతల జాబితాలోకి తాజాగా ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ చేరారు. ఆనంద్, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. రూ.7 కోట్లకుపైగా కస్టమ్స్ సుంకాల ఎగవేత, అంతర్జాతీయ హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు డైరెక్టరేట్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ దాఖలు చేసిన ఛార్జిషీటు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. డీఆర్ఐ ప్రాసిక్యూషన్ కంప్లయింట్‌ను స్థానిక కోర్టు విచారణకు స్వీకరించిన అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ రంగంలోకి దిగింది. కాగా, ఇప్పటికే ఆప్ సీనియర్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్‌సింగ్, కైలాశ్ గెహ్లాట్, అమనతుల్లా ఖాన్, విజయ్ నాయర్‌పై వివిధ కేసుల్లో కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే.