న్యూఢిల్లీ, నవంబర్ 7: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు జరుపుతున్న కొందరు వ్యాపారుల దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, పంచకులలోని 19 ప్రాం తాల్లో ఈ సోదాలు జరిగాయి.
వీరు ఈ-కామర్స్ ద్వారా జరుపుతున్న విక్రయాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో ఈడీ ఈ దాడులు చేపట్టింది. ఈ-కామర్స్ సైట్లలో పలువురు విక్రయదారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్తువుల ధరలను ప్రభావితం చేస్తున్నారని, ఇది ఇతర విక్రేతలకు నష్టంగా మారుతున్నదని ఈడీకి అనేక ఫిర్యాదులు అందాయి.
దీంతో ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. మరోవైపు వ్యాపారాల్లో పారదర్శకమైన పోటీ ఉండేలా చూసే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కూడా ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నది.