న్యూఢిల్లీ: ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కపిల్ రాజ్ (45) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో చేరినట్లు సమాచారం. ఆయన 2009 బ్యాచ్ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి. ఈడీ జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన గత నెల 17న వ్యక్తిగత కారణాలను చూపుతూ స్వచ్ఛందంగా ప్రభుత్వ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను బట్టి తెలుస్తున్నది.
ఈడీలో ఆయన ఎనిమిదేళ్లు పని చేశారు. ఈ కాలంలో ఆయన ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, జార్ఖండ్ భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేశారు. బ్యాంకులను మోసగించి పరారైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, డీహెచ్ఎఫ్ఎల్ ఆర్థిక మోసాల కేసులను కూడా ఆయన దర్యాప్తు చేశారు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఆయన నిర్వహించబోయే పాత్ర గురించి వెల్లడికాలేదు. కపిల్ రాజ్ ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవారు.
సహరాన్‌పూర్‌లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కపిల్ బీటెక్ (ఎలక్ట్రానిక్స్) గ్రాడ్యుయేట్. కాగా, సీబీడీటీ మాజీ చైర్మన్ కేవీ చౌదరి ఆర్ఐఎల్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ధ్రువ అడ్వయిజర్స్ ఎల్ఎల్పీ వ్యవస్థాపకుడు దినేశ్ కనబర్ కూడా ఆర్ఐఎల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కపిల్ కూడా ఆర్ఐఎల్కు వెళ్లడంతో విస్తృత చర్చ జరుగుతున్నది.