Sabarimala gold case : శబరిమల (Sabarimalai) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) లోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కు కొల్లాం విజిలెన్స్ కోర్టు (Kollam Vegilence court) అనుమతిచ్చింది. కేసులో కీలక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు సహా సంబంధిత దస్త్రాలను ఈడీకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.
ఈ కేసులో ఇప్పటివరకు నమోదైన రెండు ఎఫ్ఐఆర్ కాపీలు, అరెస్టైన ఏడుగురు నిందితులకు సంబంధించి సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్త్రాలను ఈడీకి తక్షణమే ఇవ్వాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈడీ దీనిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేయనుంది.
శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం రావడం సంచలనం రేపింది.
దీనిపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ ఈడీ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు కొల్లాం విజిలెన్స్ కోర్టులో పిటిషన్ వేయగా.. కేంద్ర దర్యాప్తు బృందం విజ్ఞప్తిని సిట్ వ్యతిరేకించింది. ఒకేసారి రెండూ కొనసాగడం దర్యాప్తును ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడింది. అయినప్పటికీ విజిలెన్స్ కోర్టు మాత్రం ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.