న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన కంపెనీలకు చెందిన రూ. 36 కోట్ల మేరకు విలువచేసే 43 ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసినట్లు గురువారం అధికార వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని షికోహ్పూర్లో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ చర్య చేపట్టింది. రాబర్ట్ వాద్రా, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు ధ్రువీకరించారు.
ఓ క్రిమినల్ కేసులో 56 ఏళ్ల రాబర్ట్ వాద్రాపై దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ రిపోర్టు దాఖలు చేయడం ఇదే మొదటిసారి. పీఎంఎల్ఏ కింద స్థానిక కోర్టులో వాద్రా, ఇతరులపై చార్జిషీట్ దాఖలైంది. ఏప్రిల్లో వాద్రాను ఈడీ ప్రశ్నించింది. గుర్గావ్లోని షికోహ్పూర్లో రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ 2008లో చేసిన ఓ భూమి కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. గతంలో మరో మనీలాండరింగ్ కేసులో కూడా వాద్రాను ఈడీని ప్రశ్నించింది.