Nirav Modi | పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.29.75 కోట్ల విలువైన తాజా ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సందేహాస్పద ఆస్తులను అటాచ్ చేసేందుకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆస్తులు బ్యాంకు డిపాజిట్లు, భూమి, భవనాల రూపంలో ఉన్న ఆస్తులను అటాచ్ చేసినట్లు పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కేసును ఐదు సంవత్సరాలుగా రెండు బిలియన్ల మోసంపై ఏజెన్సీ విచారణ జరిపింది. ఇంతకు ముందు ఈడీ భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న నీరవ్ మోదీకి చెందిన రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైలులో ఉన్నారు.
బ్యాంక్ రుణాల ఎగవేతకు సంబంధించిన మోసం కేసుకు సంబంధించి భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసులో సీబీఐ విచారిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్, అతని మామ మెహుల్ చోక్సీ.. ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లో బ్యాంక్ అధికారులతో కలిసి మోసానికి పాల్పడ్డారని.. నకిలీ హామీ లేఖలను జారీ చేశారని ఆరోపించారు. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. 2019 డిసెంబర్లో నీరవ్‌ను ముంబయి పీఎంఎల్నే కోర్టు పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. అదే సంవత్సరం లండన్‌లో అరెస్టయ్యాడు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం.. నీరవ్, అతని సహచరులకు చెందిన రూ.692.90 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. రూ.1,052.42 కోట్ల విలువైన ఆస్తులను బాధిత బ్యాంకులు, పీఎన్బీ సంబంధిత గ్రూప్ బ్యాంకులకు విజయవంతంగా తిరిగి ఇచ్చామని చెప్పింది.