చండీఘడ్: పంజాబ్ పరిశ్రమల, విద్యుత్తు శాఖ మంత్రి సంజీవ్ ఆరోరా(Sanjeev Arora) నివాసంపై ఇవాళ ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ మంత్రి ఇంటిపై దాడులు చేయడం ఈ ఏడాది ఇది మూడోసారి. మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్నది. ఉదయం 5 గంటలకు చండీఘడ్‌లోని మంత్రి ఇంటికి ఈడీ చేరుకున్నది. ఆపరేషన్ సమయంలో మంత్రి నివాసం ముందు ఈడీ అధికారులకు చెందిన 8 వాహనాలను నిలిపారు. ఏప్రిల్‌లో ఓ సారి ఈడీ రెయిడ్ నిర్వహించింది. ఫెమా చట్టం ఉల్లంఘన కింద ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించనున్నట్లు ఆయన గతంలో చెప్పారు.
2024లో ఓసారి కూడా ఈడీ తనిఖీ చేపట్టింది. పరిశ్రమలకు కేటాయించిన భూములను రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకున్న మనీల్యాండింగ్ అంశంపై సంజీవ్ ఆరోరాను ప్రశ్నిస్తున్నారు. తొలిసారి ఈడీ దాడి జరిగిన సమయంలో.. ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మళ్లీ సంజీవ్ ఆరోరా నివాసంలో ఈడీ తనిఖీలు మొదలుపెట్టిందని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సంవత్సరంలో ఇది మూడోసారి అని, చర్యలు తీసుకుంటామని, రెయిడ్స్ ఎన్ని సార్లు చేసినా ఏమీ దొరకలేదన్నారు.