న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఈడీ అధికారులు ఇక నుంచి అనుమానితులు, సాక్షులను ఇష్టం వచ్చిన వేళల్లో, అర్ధరాత్రి వరకు విచారణ పేరుతో వేధించడం కుదరదు. అలాగే వారిని విచారణకు పిలిచి గంటల తరబడి వేచి చూసేలా చేయడాన్ని చట్టవిరుద్ధ చర్యగా భావిస్తారు. ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక నుంచి కార్యాలయ పనివేళల సమయంలో మాత్రమే వారిని ఈడీ విచారిస్తుంది. ఈ మేరకు తన అధికారులకు ఈడీ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. అయితే కొన్ని పరిస్థితుల్లో పనివేళల తర్వాత కూడా వారిని విచారించవచ్చునని, అందుకు పైఅధికారి అనుమతి తీసుకోవాలని పేర్కొంది. కాగా, తనను ఒక కేసులో విచారణకు పిలిచిన ఈడీ అర్ధరాత్రి వరకు విచారించి ఇబ్బంది పెట్టిందంటూ 64 ఏండ్ల వ్యక్తి వేసిన పిటిషన్‌పై స్పందించిన బాంబే హైకోర్టు ఇలా ఒక వ్యక్తిని అర్ధరాత్రి వరకు విచారించడం అతడి వ్యక్తిగత, నిద్రా హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిని సవరిస్తూ ఈడీ తమ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది.
పరిమితికి మించి అడ్మిషన్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: జాతీయ విద్యా విధానం-2020ని అనుసరించే సాకుతో పలు విద్యా సంస్థలు అక్రమంగా పరిమితిని మించి విద్యార్థులను వివిధ కోర్సుల్లో చేర్చుకున్నాయని ప్రభుత్వ హామీలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అడ్మిషన్లలో నిబంధనలు ఉల్లంఘించినా, అలాంటి విద్యా సంస్థలపై యూజీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎం తంబిదురై నేతృత్వంలోని కమిటీ తాజా నివేదికలో వెల్లడించింది. కొన్ని బడా విద్యాసంస్థల వైఖరి కారణంగావిద్యా వ్యవస్థలో గుత్తాధిపత్యం పెరిగిపోతున్నదని కమిటీ పేర్కొంది. ఈ విద్యాసంస్థలు తమకు నిర్దేశించిన సంఖ్య కన్నా అధికంగా విద్యార్థులను వివిధ కోర్సుల్లో చేర్చుకుంటున్నాయని, దీని కారణంగా చిన్న, మధ్యస్థాయి విద్యాసంస్థలు, పలు ప్రముఖ సొసై టీ, ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో నడుస్తున్నవి కూడా మూతపడుతున్నాయని తెలిపింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొత్త విద్యాసంస్థల స్థాపనకు ఎవరూ ముందుకు రారని పేర్కొంది. దీనిపై యూజీసీ స్పందించాలని, చిన్నా, పెద్దా విద్యా సంస్థల తేడా లేకుండా అందరికీ నిబంధనలు అమలు చేయాలని కమిటీ సూచించింది.