Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్ధిఖీని 2002 నాటి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PML) సెక్షన్ 19 కింద అరెస్టు చేసింది. అల్ ఫలాహ్తో సంబంధం ఉన్న చోట్ల ఇటీవల జరిగిన సోదాల సమయంలో లభించిన ఆధారాల ఆధారంగా ఈడీ చర్యలు తీసుకుంది. ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అల్ ఫలాహ్ గ్రూప్‌పై చర్యలు తీసుకుంది. ఫరీదాబాద్‌కు చెందిన అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం న్యాక్ (NAAC) అక్రిడిటేషన్‌పై తప్పుడు ప్రకటనలు చేసిందని.. తద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వాటాదారులను తప్పుదారి పట్టించి లాభాలను ఆర్జించిందని ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.
UGC చట్టం, 1956లోని సెక్షన్ 12(b) ప్రకారం గుర్తింపు పొందినట్లుగా యూనివర్సిటీ తప్పుడు ప్రచారం చేసిందని ఎఫ్ఐఆర్ పేర్కొంది. వాస్తవానికి యూజీసీకి అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం సెక్షన్ 2(f) కింద మాత్రమే రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా గుర్తించినట్లుగా స్పష్టం చేసింది. ఆ విశ్వవిద్యాలయం ఎప్పుడూ సెక్షన్ 12(b) కోసం దరఖాస్తు చేసుకోలేదని.. ఈ నిబంధన కింద ఎలాంటి గ్రాంట్లను పొందేందుకు అర్హత లేదు. ఈ తప్పుడు ప్రకటనలతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని.. ఇందులో మనీలాండరింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా ఈడీ భావిస్తున్నది.విశ్వవిద్యాలయం, అనుబంధ సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ సమగర దర్యాప్తును నిర్వహిస్తున్నది.