న్యూఢిల్లీ, జూన్ 3: భద్రత పేరిట కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ నిబంధనలపై టెక్ సంస్థలు మండిపడుతున్నాయి. తాజా నిబంధనలు దేశంలో భయానక వాతావరణాన్ని కలుగజేస్తున్నట్టు ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నెల చివరి వారంలో అమల్లోకి రానున్న కొత్త నిబంధనల్లో.. డేటా తస్కరణ జరిగిన విషయాన్ని ఆరు గంటల్లో గుర్తించి ఐటీ శాఖకు తెలపాలని ఉన్నదని గుర్తుచేసింది. సైబర్ సెక్యూరిటీ ఘటనల రిపోర్టింగ్ వ్యవధి ప్రపంచవ్యాప్తంగా 72 గంటలుగా ఉంటే.. దేశంలో ఆ వ్యవధిని 6 గంటలుగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. వ్యవధిని పెంచాలని కోరింది. కస్టమర్ల వివరాలు, ఐపీ అడ్రస్‌లను ఐదేండ్ల పాటు స్టోర్ చేయడం ఆర్థికంగా కష్టమైన విషయమని తెలిపింది. నిబంధనలు పాటించని వీపీఎన్ కంపెనీలకు జరిమానా, జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం అంటున్నదని.. ఇలా చేస్తే ఏ కంపెనీ కూడా దేశంలో సేవలు అందించలేదని హెచ్చరించింది. ఫేస్బుక్, గూగుల్, రిలయన్స్ తదితర సంస్థల సేవా ప్రతినిధిగా ఐఏఎంఏఐ వ్యవహరిస్తున్నది. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. దేశంలో తమ సేవలను నిలిపేస్తున్నట్టు ప్రముఖ వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్ ‘ఎక్స్‌ప్రెస్ వీపీఎన్’ గురువారం తెలిపింది.