న్యూఢిల్లీ, అక్టోబర్ 11: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మారింది. నవంబర్ 25న ఆ రాష్ట్రంలో పోలింగ్ జరగనున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం వెల్లడించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23న నిర్వహించనున్నట్టు తొలుత ఈసీ ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల విజ్ఞప్తి మేరకు పోలింగ్ తేదీని మార్చినట్టు ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఆ రాష్ట్రంలో భారీ సంఖ్యలో పెండ్లిండ్లు, సామాజిక కార్యక్రమాలు జరగనున్నట్టు, ఈ కారణంగా చాలామంది పోలింగ్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయా పార్టీలు, సంస్థలు తమకు వివరించినట్టు ఈసీ పేర్కొంది. మరోవైపు రవాణా వసతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, దీని వల్ల పోలింగ్ శాతం కూడా తగ్గే ఆస్కారం ఉందని విన్నవించడంతో పోలింగ్ తేదీని మార్చినట్టు తెలిపింది.