న్యూఢిల్లీ: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. పోస్టర్లు, పాంప్లెట్ల పంపకం, నినాదాలు చేయడం సహా ఏ రూపంలోనూ ఎన్నికల ప్రచారంలో పిల్లలను వినియోగించవద్దని రాజకీయ పార్టీలు, నాయకులను కోరింది. బాలకార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నట్టు తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన పనులు, కార్యకలాపాల్లో చిన్నారులు పాల్గొనకుండా చూడాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.