E20 Petrol : E20 పెట్రోల్ అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol) ను వినియోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. E20 పెట్రోల్ సురక్షితం కాదంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో E20 పెట్రోల్ వాడకాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది అక్షయ్ మల్హోత్రా (Akshay Malhotra) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
సోమవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, వాహన ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధన భద్రత, పర్యావరణ సంరక్షణ వంటి లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం E20 పెట్రోల్ వాడాలనే నిర్ణయం తీసుకుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ను వినియోగించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చడానికి ముందడుగు పడినట్లు అయ్యింది.
20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదని ఇటీవల కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. E20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని వాహనదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే దీనిపై సహజవాయువు మంత్రిత్వశాఖ ఇటీవల వివరణాత్మక స్పష్టతనిచ్చింది. E20 పెట్రోల్ వినియోగంపై భయాలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవంది. ఇథనాల్ కలిసిన పెట్రోల్‌తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది.
ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందని మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుందని, దానివల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ, అది అతి స్వల్పం మాత్రమేనని పేర్కొంది. సంప్రదాయ, E20 ఇంధనం నింపిన వాహనాలకు ఒక లక్ష కిలోమీటర్ల మేర జరిపిన పరీక్షలో పవర్, టార్క్, ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తేడాలేమీ కనిపించలేదని తెలిపింది.