న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాష్ క్షిపణి వ్యవస్థ (Akash missile system) మరో ఘనత సాధించింది. ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను ధ్వంసం చేసింది. దీంతో ఆ సామర్థ్యం ఉన్న తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో అస్త్రశక్తి 2023 విన్యాసాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) నిర్వహించింది. ఈ సందర్భంగా నింగి నుంచి దూసుకొచ్చిన నాలుగు లక్ష్యాలను ఆకాష్ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేసింది. దీని కోసం ఒకే ఫైరింగ్ యూనిట్‌ను వినియోగించారు. కమాండ్ గైడెన్స్ ద్వారా సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించే సామర్థ్యాన్ని ఆకాష్ క్షిపణి వ్యవస్థ చాటింది. ఈ శక్తి సామర్థ్యం ఉన్న తొలి దేశంగా భారత్ అవతరించింది.
కాగా, ఆకాష్ ఫైరింగ్ యూనిట్లో ఫైరింగ్ లెవల్ రాడార్ (ఎఫ్‌ఎల్‌ఆర్), ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ (ఎఫ్‌సీసీ), రెండు ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్లు (ఏఏఎఫ్ఎల్), ఐదు క్షిపణులు ఉంటాయి. దూసుకొచ్చే లక్ష్యాలను ఫైరింగ్ లెవల్ రాడార్ గుర్తించి వాటి గమనాన్ని ట్రాక్ చేస్తుంది. లక్ష్యాల ధ్వంసానికి ఫైరింగ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆదేశిస్తారు. దీంతో రెండు లాంచర్ల నుంచి రెండు క్షిపణులు ఫైర్ అవుతాయి. ఆ వెంటనే మరో రెండు క్షిపణులు మరో రెండు టార్గెట్ల వైపు దూసుకెళ్తాయి. ఇలా నాలుగు లక్ష్యాలను ఒకేసారి నాలుగు క్షిపణులు ధ్వంసం చేస్తాయి.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే అత్యాధిక క్షిపణి వ్యవస్థ ఆకాష్. సుమారు పదేళ్లుగా సాయుధ దళాల్లో వినియోగిస్తున్న ఈ వ్యవస్థ భారత గగనతల రక్షణకు, దేశ భద్రతకు భరోసాగా నిలిచింది.
Video: Indigenous Akash missile system destroying 4 targets simultaneously https://t.co/D1w2tqY6LN pic.twitter.com/Igvz13EIic
— Frontalforce 🇮🇳 (@FrontalForce) December 17, 2023