Air India | ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో జైపూర్ నుంచి ముంబయికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి జైపూర్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. జైపూర్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.01 గంటలకు AI-612 నంబరు గల విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 18 నిమిషాల్లోనే అత్యవసర పరిస్థితుల్లో జైపూర్ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. సాంకేతిక లోపాన్ని గుర్తించేందుకు విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేశారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాతో పాటు విమానాశ్రయ పరిపాలన బృందం సాంకేతిక కారణాలను పరిశీలిస్తున్నాయి. ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, విమానంలో ఎదురైన సాంకేతిక సమస్య ఏంటో తెలియరాలేదు. విమానం ఆకాశంలో ఎగురుతున్న సమయంలో లోపాన్ని గుర్తించిన పైలట్.. ఏమాత్రం ఆలస్యం చేకుండా విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.