Snowfall @ Kashmir | కశ్మీర్లో గత రెండు రోజులుగా భారీగా హిమపాతం కురుస్తున్నది. పలు ప్రాంతాలు మంచుతో కప్పిపోయాయి. రానున్న మరో 4 రోజులపాటు ఇలాగే మంచు కురిసే అవకాశాలు ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తున్నది. దీంతో జమ్ములోని పూంచ్, రాజౌరి జిల్లాలను దక్షిణ కశ్మీర్‌తో కలిపే మొఘల్ రహదారిని ఆదివారం మూసివేశారు.
ఆదివారం ఉదయం శ్రీనగర్‌లో 26.1, ఖాజీగుండ్‌లో 16.0, పహల్గామ్లో 14.3, కుప్వారాలో 16.2, కుక్నాగ్లో 11.4, గుల్మార్గ్లో 16.8, జమ్ములో 16.2, బనిహాల్‌లో 24.8, బటోట్‌లో 17.9, కత్రా 17, కతువాలో 10.2 మి.మీ మంచు కురిసింది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావం కారణంగా జమ్ముకశ్మీర్‌లో ఈ నెల 10 వరకు వర్షాలు, మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
మొఘల్ రోడ్డులోని పోషణ-పీర్ కీ గలి మధ్య 5 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. 11,433 అడుగుల ఎత్తులో ఉన్న పిర్ కి గలీలో మంచు కురుస్తుండటంతో సాధారణంగా మొఘల్ రహదారిని శీతాకాలంలో మూసివేస్తారు. మన్సార్ మోహ్రాతో పాలు అనేక ప్రదేశాల్లో గత అర్ధరాత్రి వేళ మంచు కురిసింది. అనంతరం ఈ మార్గంలో ట్రాఫిక్‌ను నిలువరించారు. శనివారం ఇక్కడి పలు ప్రాంతాల్లో రాత్రిపూట కంటే పగటి సమయంలో ఎక్కువ మంచు కురిసినట్లు అధికారులు చెప్పారు.