న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Winter Session) ఉభయ సభల్లోనూ విలువైన సమయం వృథా అయ్యింది. లోక్సభ భారీ అంతరాయాలను ఎదుర్కొంది. మూడవ సెషన్లో 65 గంటలు, మొత్తం మూడు సెషన్లలో కలిపి 70 గంటలకు పైగా సమయాన్ని కోల్పోయింది. నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడు విడతలుగా కొనసాగాయి. డిసెంబర్ 19న లోక్సభలో గొడవ, ప్రతిపక్ష ఎంపీల నిరసనల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ఆకస్మికంగా ముగిశాయి. శుక్రవారం ఉభయ సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి.
కాగా, అధికారిక సమాచారం ప్రకారం లోక్సభ మొదటి సెషన్లో 5 గంటల 37 నిమిషాలు వృథా అయ్యాయి. రెండవ సెషన్లో గంటా 53 నిమిషాలు, ముగింపు సెషన్లో ఆశ్చర్యకరంగా 65 గంటల 15 నిమిషాలు లోక్సభ కోల్పోయింది.
లోక్సభ తొలి సెషన్లో ఏడు, రెండో సెషన్లో 15, మూడో సెషన్లో 20 సమావేశాలు జరిగాయి. తొలి సెషన్లో ఏడు గంటలు, రెండో సెషన్లో 33 గంటలకుపైగా, మూడో సెషన్లో 21.7 గంటలపాటు చర్చల్లో ఎంపీలు పాల్గొన్నారు.
మరోవైపు రాజ్యసభ తొలి సెషన్లో 34.16 గంటల పాటు చర్చ జరిగింది. రెండో సెషన్లో చర్చా సమయం 115.21 గంటలకు పెరిగింది. అయితే మూడవ సెషన్లో చర్చల సమయం 62 గంటల కనిష్టస్థాయికి పడిపోయింది.