న్యూఢిల్లీ, జూలై 25: భారతదేశ అత్యున్నత పీఠంపై ద్రౌపది ముర్ము ఆసీనులయ్యారు. సోమవారం ఉదయం అట్టహాసంగా జరిగిన వేడుకలో 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమక్షంలో ఆమెతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. దేశ చరిత్రలో రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ కావడం విశేషం. ద్రౌపది ముర్ము ప్రమాణానికి ముందు 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించారు. సంతాలీ సంప్రదాయానికి చెందిన చీరలోనే ఆమె ప్రమాణస్వీకారం చేయడం విశేషం. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా కేంద్రమంత్రులు, సీఎంలు, ఎంపీలు, రాయబారులు హాజరయ్యా రు. ప్రమాణం అనంతరం రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా ప్రసంగించారు.
ముర్ము ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
దేశాధినేతల శుభాకాంక్షలు
రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు పలువురు దేశాధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చైనా, రష్యా, శ్రీలంక, నేపాల్ దేశాధినేతలు అభినందనలు తెలిపారు. భారత్తో సత్సంబంధాలు బలపర్చుకునేందుకు ఆమెతో కలసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తన పేరు ద్రౌపది కాదని, ‘పుటి’ అసలు పేరు అని, చిన్నప్పుడు బడిలో టీచర్ ద్రౌపది అని తనకు పేరు పెట్టారని ఓ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు.
ప్రతిపక్ష నేతకు కుర్చీ కేటాయింపులో అవమానం
రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు సరైన స్థానంలో కుర్చీ కేటాయించకుండా అవమానించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ప్రతిపక్ష నేతలు లేఖ రాశారు. హోంశాఖ నిర్ధారించిన ప్రోటోకాల్ ప్రకారం మూడో వరుసలో ఆయనకు సీటు కేటాయించామని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి పీవీ జోషి తెలిపారు. కోవింద్ వీడ్కోలు సమావేశంలో మాత్రం ఖర్గేకు ముందు వరుసలో సీటు కేటాయించారు.
బడికి పోవడమే పెద్ద కల..
ఒడిశాలోని చిన్న గ్రామంలో నేను పుట్టాను. ప్రాథమిక విద్య కోసం బడికి వెళ్లడమే చాలా పెద్ద కల. అయినా ఎన్నో ఇబ్బందులు పడి చివరికి బడికి వెళ్లాను. మా గ్రామంలో కాలేజీకి వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. నిరుపేద, ఆదివాసీ కుటుంబంలో పుట్టిన నాకు.. వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి రాష్ట్రపతిగా అయ్యే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదీ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అయిన భారతదేశ గొప్పతనం. – ద్రౌపది ముర్ము