Gujarat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా 2030 వరకు దేశంలోని 100 శాతం పిల్లలను బడులకు పంపించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ పాలిత రాష్ర్టాలే అడ్డంకిగా మారుతున్నాయి. సెకండరీ స్కూల్ చదువులను మానేసిన డ్రాపౌట్స్ల వివరాల కోసం దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో గుజరాత్‌తో పాటు పలు పెద్ద రాష్ర్టాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆ సూచీలో ఉన్న ఏడు రాష్ర్టాల్లో మూడు బీజేపీ పాలిత రాష్ర్టాలున్నాయి. అందులోనూ ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ రెండో స్థానంలో ఉంది. జాతీయ సగటు సెకండరీ స్కూల్ డ్రాపౌట్స్ కంటే ఆ రాష్ర్టాలలో 5 శాతం ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. సర్వే గణాంకాల ప్రకారం జాతీయ సగటు స్కూల్ డ్రాపౌట్స్ రేటు 12.6 శాతంగా ఉంది. బడి మానేసే పిల్లలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాలలో బీహార్, గుజరాత్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లు పైవరుసలో ఉన్నాయి.
ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశంలో సమగ్ర శిక్షణ పథకం అమలు తీరుపై జరిగిన సమీక్ష సమావేశంలో పెద్ద రాష్ర్టాలలో డ్రాపౌట్స్ తగ్గకపోవటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా 2021-22 ఏడాదికి గానూ బీహార్‌లో 20.46 శాతం సెకండరీ స్థాయి డ్రాపౌట్స్ టాప్‌లో ఉండగా, 17.85 శాతం డ్రాపౌట్స్‌తో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన మేఘాలయలో 21.7 శాతం, అస్సాంలో 16.7 శాతం డ్రాప్ అవుట్స్ ఉన్నారు. పంజాబ్‌లో 21.7 శాతం, ఆంధ్రప్రదేశ్ 16.7 శాతం చదువు మానేసే విద్యార్థులతో మిగతా రాష్ర్టాలకన్నా అగ్రభాగంలో ఉన్నాయి. అలాగే మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా 10.7 శాతం డ్రాపౌట్స్ ఉన్నా, 5 జిల్లాల్లో 15 శాతం కంటే ఎక్కువగానే డ్రాపౌట్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా 8 జిల్లాల్లో 15 నుంచి 23 శాతం డ్రాపౌట్స్ ఉన్నారు. అయితే యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్) సంస్థ లెక్కల ప్రకారం మనదేశంలో డ్రాపౌట్స్లో 33 శాతం బాలికలే. ఇండ్లలో పని చేసేందుకు తల్లిదండ్రులే ఆడపిల్లలను సెకండరీ స్థాయిలోని చదువు మాన్పిస్తున్నారు.