న్యూఢిల్లీ, జూలై 6 : రోడ్డు భద్రతా నిబంధనలను మరింత పటిష్టం చేసి పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడాన్ని నిరోధించడానికి మోటారు వాహనాల చట్ట నిబంధనల్లో భారీ సవరణలకు కేంద్రం యోచిస్తున్నది. రాష్ర్టాలతో దాదాపు రెండేళ్లపాటు సంప్రదింపులు జరిపి మంత్రుల బృందం నుంచి ఆమోదం పొందిన తర్వాత తీసుకురావలసిన మార్పుల కోసం కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఒక ప్రతిపాదనను రూపొందించింది. పదేపదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడం కీలక ప్రతిపాదనల్లో ఒకటి. సస్పెండ్ అయిన లైసెన్సును పునరుద్ధరించుకోవడానికి వాహనదారులు ప్రభుత్వ అధీకృత డ్రైవింగ్ పరీక్షా కేంద్రంలో మళ్లీ డ్రైవింగ్ పరీక్ష రాయవలసి ఉంటుంది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రుల బృందం సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు ఆమోదం లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలకు సంబంధించి వాహన్ పోర్టల్లో వాహన ఫిట్నెస్, కాలుష్య ధృవీకరణ పత్రం పునరుద్ధరణ వంటి సేవలను తాత్కాలికంగా పరిమితం చేయాలని కూడా మంత్రిత్వశాఖ ప్రతిపాదిస్తున్నది. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, బీమా లేని వాహనాలను ఉపయోగించడంపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.