తిరువనంతపురం: వైద్యురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన కేరళ మంత్రి సిబ్బంది డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. కేరళ జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ వ్యక్తిగత కార్యదర్శి గోపకుమారన్ నాయర్ వద్ద 34 ఏళ్ల సంతోష్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన అతడు బుధవారం తెల్లవారుజామున కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని మ్యూజియం గేట్ వద్ద 36 ఏళ్ల వైద్యురాలిని లైంగికంగా వేధించాడు. అసభ్యంగా ప్రవర్తించగా ఆమె ప్రతిఘటించింది. అనంతరం పారిపోతున్న అతడ్ని పట్టుకునేందుకు ఆ మహిళా డాక్టర్ వెంబడించింది. అతడు పారిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
మరోవైపు తనను గుర్తించకుండా ఉండేందుకు సంతోష్, గెడ్డం తీసి గుండు కొట్టించుకున్నాడు. అలాగే వైద్యురాలిపై అసభ్య ప్రవర్తనకు ముందు మంగళవారం రాత్రి ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడి సీసీటీవీలో అది రికార్డైంది. అతడు డ్రైవ్ చేసిన కారును పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా సంతోష్‌ను అరెస్ట్ చేశారు. కాగా, గుండుతో ఉన్న సంతోష్‌ను ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో ఆ వైద్యురాలు ఈజీగా గుర్తించింది. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.