బెంగళూరు: కర్ణాటకలోని 200కుపైగా ఆలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ విధించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మొత్తం 211 దేవాలయాలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయాలని ప్రభుత్వ మత సంస్థ అయిన కర్ణాటక రాష్ట్ర ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిని దశల వారీగా అమలుచేయనున్నది. ఈ మేరకు భక్తుల డ్రెస్ కోడ్‌కు సంబంధించిన బ్యానర్లను రాష్ట్ర ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసింది. ‘హిందూ సాంస్కృతిక విలువలను గౌరవించే దుస్తుల కోడ్‌ని అనుసరించాలని భక్తులను కోరుతున్నాం. మహిళలు చీరలు ధరించేందుకు ప్రాధాన్యతనివ్వాలి. పురుషుల కోసం కూడా డ్రెస్ కోడ్ నిర్ణయిస్తున్నాం’ అని పూజారి హరినారాయణ అస్రన్న తెలిపారు.
మరోవైపు దక్షిణ కన్నడ జిల్లాలోని కటీల్ దుర్గాపరమేశ్వరి దేవాలయం, పొలాలి రాజరాజేశ్వరి దేవాలయంలో సాంప్రదాయ దుస్తులను ఆ రాష్ట్ర ధార్మిక పరిషత్ ఇటీవల తప్పనిసరి చేసింది. ప్రభుత్వం నియంత్రణలో ఉన్న దేవాలయాల్లో ఆచారాలు, పూజల నిర్వహణతోపాటు భక్తుల కోసం డ్రెస్ కోడ్‌పై ఈ సంస్థ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
అయితే రాష్ట్ర ధార్మిక పరిషత్ సిఫారసులను ముందుగా హిందూ మత సంస్థలు, ధార్మిక ట్రస్ట్‌లు ఆమోదించాలి. ఆ తర్వాత క్యాబినెట్ ఆమోదం కోసం పంపుతారు.