న్యూఢిల్లీ: మణిపూర్‌లో జరుగుతున్న హింసతో ఆల్‌ఖయిదా (Al-Qaeda) ఉగ్ర సంస్థకు లింకు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్ఖయిదాకు చెందిన భారతీయ బ్రాంచ్.. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్‌కు బెదిరింపులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కుక్కీకి చెందిన ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన నేపథ్యంలో ఏక్యూఐఎస్(ఆల్ ఖయిదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్) కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. భారత్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన గురించి కూడా ఆ గ్రూపు చర్చించింది. ఇక ఈ అంశంపై ఇండియాకు మద్దతు ఇస్తున్న అమెరికా శైలిని ఆల్ ఖయిదా ఖండించినట్లు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన రిపోర్టు తెలిపింది.
ఉర్దూ మ్యాగిజైన్ ‘నవా యే ఘజావత్ హింద్’ అనే పత్రికలో ఏక్యూఐఎస్ తన హెచ్చరికలు జారీ చేసింది. మోదీ పాలనలో ముస్లింలు, క్రైస్తవులకు భద్రత కరువైందని, ఆ మైనార్టీలకు సరైన భద్రత కల్పించడం లేదని ఏక్యూఐఎస్ ఆరోపించింది. మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతున్నా.. ఇండియాకు సపోర్ట్ ఇస్తున్న అమెరికా సర్కార్‌ను కూడా ఏక్యూఐఎస్ తప్పుపట్టింది. కుక్కీ క్రైస్తవులపై హిందుత్వవాదులు దాడులు చేస్తున్నట్లు ఆ ఉగ్ర సంస్థ ఆరోపించింది.
స్థానికంగా జరుగుతున్న ఆందోళనలకు ఆల్‌ఖయిదా ఉగ్ర సంస్థ ఊతం ఇస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మణిపూర్ వర్గ హింసపై ఇండియాను టార్గెట్ చేస్తూ ఓ ఉగ్ర సంస్థ మాట్లాడడం కూడా ఇదే మొదటి సారి. ఏక్యూఐఎస్ విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మణిపూర్ హింస వెనుక ప్రత్యక్షంగా ఆల్‌ఖయిదా పాత్ర ఉన్నట్లు భావిస్తున్నారు. కుక్కీ నార్కో ఉగ్రవాదులకు ఆల్‌ఖయిదా సహకారం అందిస్తున్నట్లు ఓ రిపోర్టులో తేలింది. గంజాయి సాగు పెరగడం, రోహింగ్యా ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలన్న లక్ష్యంతో అక్కడ ఆల్‌ఖయిదా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుక్కీ నార్కో టెర్రరిస్టులకు ఆల్‌ఖయిదా మద్దతు ఇవ్వడం వల్ల యావత్ ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.