Double Suicide : లైంగిక హింస, బెదిరింపులు ఓ 19 ఏళ్ల యువకుడి ప్రాణం తీశాయి. ఆ హింసను భరించలేక అతను ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. అంతకుముందు అతడు తన ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు అధికారుల పేర్లను సూసైడ్ నోట్లో రాసిపెట్టాడు. దాంతో ఆ అధికారుల్లో ఒకరు కూడా శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఈ ఘటన రెండు ప్రాణాలు తీసినట్లయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. గోమ్చూ యెకార్ అనే 19 ఏళ్ల యువకుడు ఇటానగర్‌కు సమీపంలోని తన ఇంట్లో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు మాజీ డిప్యూటీ కమిషనర్, ఐఏఎస్ అధికారి తాలో పోటోమ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లిక్వాంగ్ లొవాంగ్ కారణమని సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. ఆ ఇద్దరూ తనను లైంగికంగా హింసించారని, దాంతో తనకు హెచ్ఐవీ సోకిందని పేర్కొన్నాడు.
దాంతో ఇద్దరూ కలిసి తనకు రూ.కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత పరిహారం కోసం అడిగితే పట్టించుకోలేదని, మళ్లీ అడిగితే చంపేస్తామని బెదిరించారని తన నోట్లో రాసుకొచ్చాడు. అందుకే జీవితంపై విరక్తితో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో యువకుడి తండ్రి తగోమ్ యెకార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆ ఇద్దరు అధికారులు కలిసి తన కొడుకుకు బతుకలేని పరిస్థితి కల్పించారని యువకుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు అధికారులకు తగిన శిక్ష విధించాలని కోరారు. ఈ క్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లిక్వాంగ్ లొవాంగ్ శుక్రవారం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలావుంటే.. యువకుడి ఆత్మహత్యకు కారణమైన మరో అధికారికి ఎలాంటి అరెస్ట్ వారెంట్ జారీ చేయలేదు.