న్యూఢిల్లీ: అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్‌పై మొబైల్ వినియోగదారులు నేరుగా తమ కాల్‌లాగ్స్ నుంచి ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలికం శాఖ(డీఓటీ) శుక్రవారం సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ యాప్‌తోపాటు డీఓటీకి చెందిన రెండు కొత్త ఆవిష్కరణలను ప్రారంభించారు.
2023లో సంచార్ సాథీ పోర్టల్‌ను డీఓటీ ప్రారంభించింది. తాజాగా మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతి వినియోగదారుని గోప్యతను, భద్రతను ఈ యాప్ అందచేస్తుందని తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారాలలో లభించే ఈ కొత్త యాప్ అనుమానాస్పద ఫేక్‌కాల్స్, మెసేజ్‌ల గురించి కస్టమర్లు నేరుగా తమ మొబైల్ లాగ్స్ నుంచి రిపోర్ట్ చేయవచ్చు.
అంతేగాక వినియోగదారులు తమ పేరిట జారీ అయిన మొబైల్ కనెక్షన్లను అన్నింటినీ గుర్తించవచ్చు. పోగొట్టుకున్న మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయడం, కనిపెట్టడం, స్వాధీనం చేసుకోవడం వంటి ఫీచర్లు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. నాణ్యమైన మొబైల్ హ్యాండ్సెట్లను యూజర్లు కొనుగోలు చేసేందుకు వీలుగా హ్యాండ్సెట్ల నాణ్యతను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.