న్యూఢిల్లీ: ఇటీవల కన్నుమూసిన భారతీయ సమాంతర సినిమా పితామహుడు, తెలంగాణ బిడ్డ శ్యామ్ బెనెగల్‌కు నివాళిగా ఆయన దర్శకత్వం వహించిన కళాఖండాలలో ఒకటైన మంథన్ చిత్రాన్ని నూతన సంవత్సరం నాడు ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ మంగళవారం ప్రకటించింది. 1970, 1980 దశకాలలో సమాంతర హిందీ సినిమాకు ప్రాణం పోసిన శ్యామ్ బెనెగల్ డిసెంబర్ 23న ముంబైలో దవాఖానలో కిడ్నీ వ్యాధితో తన 90వ ఏట కన్నుమూశారు.
ఈ ఏడాది కేన్స్ చలన చిత్రోత్సవంలోని కేన్స్ క్లాసిక్ సెక్షన్లో ప్రదర్శించడం కోసం 1976లో నిర్మించిన మంథన్ చిత్రాన్ని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్(ఎఫ్‌హెచ్‌ఎఫ్) పునరుద్ధరించింది. బుధవారం రాత్రి 8 గంటలకు దూరదర్శన్‌లో మంథన్ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్టు ఎఫ్‌హెచ్‌ఎఫ్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
బెనెగల్‌కు నివాళితో దూరదర్శన్ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తుందని ఫౌండేషన్ తెలిపింది. గుజరాత్లో డాక్టర్ వర్గీస్ కురియస్ చేపట్టిన పాల సహకార ఉద్యమం అత్యధిక పాల ఉత్పత్తిదారులున్న దేశంగా ప్రపంచంలో భారత్‌ను మార్చివేసింది. ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మంథన్ చిత్రం రూపొందింది.