లక్నో: తనకు ఉద్యోగం లేదా డబ్బు వద్దని పహల్గామ్ ఉగ్రవాదిలో మరణించిన శుభం ద్వివేది భార్య తెలిపింది. (Don’t want job or money) తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేసింది. ఉగ్రదాడికి బాధ్యులైన వారిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో బైసరన్ పచ్చిక మైదానంలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 26 మంది మరణించారు.
కాగా, పహల్గామ్ ఉగ్రవాది జరిగిన పది రోజుల తర్వాత ఈ ఘటనలో మరణించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల శుభం ద్వివేది భార్య ఆశాన్య పీటీఐతో మాట్లాడింది. తనకు ఉద్యోగం లేదా ఆర్థిక సహాయం అవసరం లేదని ఆమె చెప్పింది. ఉగ్రదాడిలో మరణించిన తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీని కోసం తాను పోరాడతానని ఆమె అన్నది. 26 మందిని చంపిన ఉగ్రవాదులను ప్రభుత్వం మట్టుబెట్టలేదని ఆమె విమర్శించింది.
మరోవైపు ఉగ్రదాడి ఘటన తర్వాత ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయంగా ఉందని ఆశాన్య తెలిపింది. వాహనం టైర్ శబ్ధం కూడా తనను కలవరపరుస్తున్నదని చెప్పింది. ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని, శుభం ఫొటో, చివరగా అతడు ధరించిన షర్ట్‌ను చూస్తూ కాలం గడుపుతున్నట్లు పేర్కొంది. పహల్గామ్ దాడికి బాధ్యులైన ఉగ్రవాదులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.