Assam CM : అస్సాం ముఖ్యమంత్రి (Assam CM), బీజేపీ సీనియర్ నేత హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sharma) మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. అస్సాంలోని హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపవద్దని, కనీసం ఇద్దరినైనా కనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల జననాల రేటు ఆందోళనకర రీతిలో తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీ డామినేట్ ఏరియాలతో పోల్చి చూస్తే ఇతర ప్రాంతాల్లో జననాల రేటు తక్కువగా ఉన్నదని అన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మైనారిటీ డామినేటెడ్ ఏరియాల్లో జననాల నిష్పత్తి ఎక్కువగా ఉన్నదని అస్సాం సీఎం చెప్పారు. అదే సమయంలో హిందువుల్లో జననాల రేటు వేగంగా తగ్గిపోతోందని అన్నారు. అందుకే పిల్లలను కనడం ఒక్కరితో ఆపవద్దని హిందూ జంటలను కోరారు. కనీసం ఇద్దరినీ కనాలని, వీలైతే ముగ్గురిని కన్నా మంచిదేనని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో మైనారిటీలు ఏడు, ఎనిమిది మంది పిల్లలను కనడం ఆపేయాలని సూచించారు.