ముంబై, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ చిత్రం ‘లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’ను మహారాష్ట్రలో విడుదల చేయరాదని మఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌థాకరే హెచ్చరించారు. పాకిస్థానీ నటుల చిత్రాలను భారతదేశంలో ఎందుకు విడుదల చేయడానికి అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. సకాలంలో చర్యలు తీసుకుని, ఈ సినిమా విడుదల కాకుండా చూడాలని ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీలను కోరారు. కళకు సరిహద్దులు తెలియవని, అయితే, భారతదేశాన్ని ద్వేషించే దేశం ఏదైనా, ఆ దేశ చిత్రం మహారాష్ట్రలో విడుదల చేయకూడదని అన్నారు. థియేటర్ల యజమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయన్నారు.