న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది తమ కేసును వాదిస్తారని, ఈ నేపథ్యంలో సదరు కేసును వాయిదా వేయాలని కోరుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టు(Supreme court)ను అభ్యర్థించారు. ఆ సమయంలో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ముందు ఓ వివాదంపై ఇవాళ కేసు వాదనకు వచ్చింది. సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే ఈ కేసును వాదిస్తారని, దీని కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలని న్యాయవాది కోర్టును కోరారు. ప్రస్తుతం సాల్వే విదేశాల్లో ఉన్నారని, అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భౌతికంగా ఆయన కేసును వాదించనున్నట్లు చెప్పారు.
ఆ సమయంలో సుప్రీం ధర్మాసనం సీరియస్ అయ్యింది. సీనియర్ న్యాయవాది పేరు చెబితే మేం కేసును వాయిదా వేస్తామన్న భ్రమలో ఉన్నావా అని కోర్టు ప్రశ్నించింది. బార్లో ఉన్న లాయర్ల ప్రవర్తన మారాలని కోర్టు తెలిపింది. సీనియర్ల పేరు చెప్పినంత మాత్రాన కేసును వాయిదా వేయమని కోర్టు పేర్కొన్నది. అయితే చివరకు న్యాయవాది వినతిని స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఈ కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల ఓ న్యాయవాది తన కారులో నుంచి కోర్టు కేసును వాదించిన సమయంలో సుప్రీం అతన్ని నిలదీసింది. న్యాయపరమైన అంశాల్లో హుందాతనంతో వ్యవహరించాలని కోర్టు చెప్పింది.