న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం అమెరికాలో క్యాపిటల్ హిల్(Capitol Hill)పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడికి పాల్పడిన నిరసనకారులు కొందరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే వాళ్లతో కలిసి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఓ పాటలో గొంతు కలిపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించే ఉద్దేశంతో పాటను రిలీజ్ చేశారు. జస్టిస్ ఫర్ ఆల్ అన్న టైటిల్‌తో సాగిన సాంగ్‌లో ట్రంప్ కూడా కొన్ని లైన్లు పాడారు.
ట్రంప్ పాడిన ఆ పాట స్పోటిఫ్, యాపిల్ మ్యూజిక్, య్యూట్యూబ్ ఫ్లాట్ఫామల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జైలులో ఉన్న ట్రంప్ మద్దతుదారులు జాతీయ గీతాన్ని పాటగా పాడారు. దాన్ని జే6 ప్రిజన్ సాంగ్(J6 Prison Song) అని కూడా పిలుస్తున్నారు. ఆ పాట చివరలో ఖైదీలు యూఎస్ఏ అంటూ ఆలపించారు.
ఫ్లోరిడాలో ఉన్న మార్ లాగో రిసార్టులో ట్రంప్ తన వాయిస్‌ను రికార్డు చేశారు. ఇక జైలులో ఉన్న ఖైదీలు తమకు అందుబాటులో ఉన్న జైల్హౌజ్ ఫోన్లో రికార్డు చేశారు. యాపిల్ మ్యూజిక్‌లో ఉన్న ఆధ్మాత్మిక సెక్షన్లో సాంగ్‌ను లిస్టు చేశారు. ఇక య్యూట్యూబ్‌లో ట్రాక్ కంపోజర్‌గా ట్రంప్ పేరును చేర్చారు.
ఖైదీలతో ట్రంప్ గొంతు కలిపిన పాటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులపై కూడా పోలీసులు న్యాయపరమైన చర్యలకు దిగనున్నారు.