ముంబై: ఒక వీధి కుక్క ప్రతి రోజూ లోకల్ రైలులో (Dog Travels in Local Train) ప్రయాణిస్తున్నది. దీంతో ఇది చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ షోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఒక కుక్క నిత్యం బోరివాలి స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కుతుంది. అంధేరి స్టేషన్ వరకు అది అందులో ప్రయాణిస్తుంది. లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి ఆ కుక్క ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఎంచక్కా ఒక చోట కూర్చుంటుంది లేదా పడుకుంటుంది. అంధేరి స్టేషన్లో ఆ కుక్క దిగిపోతుంది. కొంత సేపటి తర్వాత మళ్లీ బోరివాలికి ప్రయాణిస్తుంది. ఇలా ప్రతి రోజూ ఆ కుక్క ఆ లోకల్ ట్రైన్లో ప్రయాణించడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. మనుషుల మాదిరిగానే ఆ కుక్క రైలు ఎక్కడం దిగడం చూసి విస్తూ పోతున్నారు.
కాగా, ‘ఇండియా కల్చరల్ హబ్’ అన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. ‘ముంబై లోకల్ ట్రైన్లో రెగ్యులర్ ట్రావెలర్‌ని కలవండి’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. ఆ కుక్క ప్రతి రోజూ లోకల్ రైలులో ప్రయాణించడం నిజమేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ కుక్కను లోకల్ ట్రైన్లో చాలాసార్లు చూసినట్లు ఒకరు తెలిపారు. అది కూడా వర్క్ కోసం రైలులో వెళ్తున్నదని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు రైలులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఆ కుక్క తెలివిని కొందరు మెచ్చుకున్నారు. మనుషుల మాదిరిగా స్వేచ్ఛగా జీవించే హక్కు జంతువులకు కూడా ఉంటుందని ఒక జంతు ప్రియుడు పేర్కొన్నారు.