భువనేశ్వర్: కుక్క కాట్లు, కుక్కల విషయంలో యజమానులు, ఇరుగుపొరుగుకు మధ్య గొడవల నేపథ్యంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన బై లాస్ రూపొందించింది. ఈ కొత్త నియమాల ప్రకారం ఇకపై భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎవరినైనా కుక్క కరిస్తే ఆ కుక్క యజమానికి రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు.
అదేవిధంగా కుక్కల యజమానులు తమ కుక్కల చేత బహిరంగ మల, మూత్ర విసర్జన చేయించినా కూడా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్నాళ్లపాటు కుక్కలను పెంచి ఆ తర్వాత వీధుల్లో వదిలేసినా అధికారులు ముక్కుపిండి జరిమానా వసూలు చేస్తారు. మరణించిన కుక్కల కళేబరాలను బహిరంగ ప్రదేశాల్లో పడేసినా కూడా సంబంధిత వ్యక్తులు జరిమానా చెల్లించాల్సిందే. ఇవేగాక న్యూ బై లాస్లో ఇంకా పలు నియమాలను అధికారులు పొందుపర్చారు.