లక్నో: ఒక మహిళ కడుపులో 2.5 కిలోల తల వెంట్రుకలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు షాక్ అయ్యారు. వెంట్రుకల ఉండను సర్జరీ ద్వారా తొలగించారు. (Hair in woman’s stomach) ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 25 ఏళ్ల మహిళ గర్భం దాల్చినప్పుడు జుట్టు తిన్నది. తన తలపై ఉన్న జట్టుతోపాటు ఇతరుల వెంట్రుకలను ఆమె తినేది. అయితే వెంట్రుకలు తినే ఈ వింత అలవాటును ప్రసవం తర్వాత ఆమె మాసేసింది. కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడింది. ఏ ఆహారం తినలేకపోయింది. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
కాగా, ఆ మహిళను చివరకు చిత్రకూట్‌లోని జానకి కుండ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ నిర్మలా గెహానీ నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ మహిళ కడుపులో 2.5 కిలోల వెంట్రుకల ఉండ ఉన్నట్లు గుర్తించారు. 45 నిమిషాల సర్జరీ ద్వారా దానిని తొలగించారు.
Hair In Stomach
మరోవైపు జుట్టు, వెంట్రుకలు తినడం ట్రైకోఫాగియా అనే అరుదైన మానసిక పరిస్థితి అని డాక్టర్ నిర్మల తెలిపారు. పోషకాహార లోపం, జీర్ణవ్యవస్థలో అడ్డంకులు వంటి ఆరోగ్య సమస్యలకు ఇది దారితీస్తుందని చెప్పారు. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుందని ఆ డాక్టర్ వెల్లడించారు.