జోధ్‌పూర్, ఆగస్టు 1: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఎలాంటి సర్జరీ చేయకుండా ఒక వ్యక్తి కడుపులో నుంచి ఒక్కొక్కటిగా 50కి పైగా నాణేలను వైద్యులు బయటకు తీశారు. విపరీతమైన కడుపునొప్పి రావడంతో 40 ఏండ్ల బాధితుడిని అయన కుటుంబసభ్యులు గత శుక్రవారం జోధ్‌పూర్‌లోని మధురాదాస్ మాథుర్ దవాఖానకు తీసుకెళ్లారు. గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్కు తీసుకెళ్లి పరీక్షించగా కడుపులో ఓ లోహపు ముద్ద మాదిరిగా పదార్థం ఉండటాన్ని వైద్యులు గుర్తించారు.
కడుపులో ఫండస్ అనే ప్రాంతంలో పదుల సంఖ్యలో కాయిన్లు పేరుకుపోయి ఉన్నాయని, ఆపరేషన్ లేకుండా వాటిని బయటకు తీయాలని అనుకున్నామని సునీల్ అనే వైద్యుడు పేర్కొన్నారు. ఆ తర్వాత అన్నవాహిక నుంచి ఒక్కసారికి ఒకటిరెండు కాయిన్లు బయటకు తీయడం చేశామని, దీంతో అన్ని నాణేలను బయటకు తీసేందుకు దాదాపు రెండు రోజుల సమయం పట్టిందని తెలిపారు. మానసిక రుగ్మత కారణంగా ఆ వ్యక్తి నాణేలు మింగాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు.