ముంబై, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): వివాహ బంధం ఏడు జన్మల పాటు ఉంటుందని అంటారు. కానీ, ఓ డాక్టర్ల జంట పెండ్లయిన 24 గంటల్లోనే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న షాకింగ్ సంఘటన ఇటీవల పుణెలో జరిగింది. వివాహం జరిగిన వెంటనే ఇద్దరి మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తడంతో, వారు కోర్టుకు వెళ్లి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వివరాల్లోకి వెళితే .. వృత్తిరీత్యా డాక్టర్లయిన ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. కానీ వివాహం జరిగిన తెల్లారి, భర్త పిడుగులాంటి వార్త చెప్పాడు.
తాను మర్చంట్ నేవీలో పని చేస్తున్నానని, పని కారణంగా ఒకోసారి సంవత్సరం పాటు విదేశాల్లో ఉండాల్సి వస్తుందని భార్యకు చెప్పాడు. దాంతో ఆమె షాక్కు గురైంది. తనకు ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదని నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భర్త నిజాయితీగా ముందే అసలు విషయం చెప్పి ఉంటే బాగుండేదని ఈ విషయం దాచడం తనను మోసం చేయడమేనని ఆమె భావించింది. దీంతో పెండ్లయిన 24 గంటల్లోనే విడిపోవాలని వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజే వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. వారికి విడాకులు మంజూరు కావడానికి 18 నెలల సమయం పట్టింది. పెండ్లిలో ఇరువురి మధ్య ఉండాల్సిన స్పష్టత అవసరాన్ని ఈ ఉదంతం రుజువు చేసింది.