న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Rekha Gupta) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. షాలిమార్ భాగ్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం రేఖా గుప్తా ఆస్తుల వివరాలు ఏంటో తెలుసుకుందాం. 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. రేఖా గుప్తా ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. దాంట్లో ఆమె 2023-24 సంవత్సరానికి పూర్తి ఆదాయాన్ని ఆరు లక్షల 92 వేలుగా చూపించారు. ఇక ఆమె వద్ద మూవెబుల్ అసెట్స్ 1.25 కోట్లు ఉన్నాయి. జనవరి 15వ తేదీన ఈసీకి తన అఫిడవిట్ సమర్పించారామె. ఆమెకు స్థిర ఆస్తి సుమారు 2.3 కోట్లు ఉన్నట్లు ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు.
రేఖా గుప్తా వసయు 50 ఏళ్లు. అయితే ఆమెకు సుమారు 48.44 లక్షల బ్యాంకు రుణం ఉన్నది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రేఖా గుప్తాకు రెండు రెసిడెన్షియల్ ప్రాపర్టీలు ఉన్నాయి. ఒకటి ప్రాపర్టీలో తన భర్త భాగస్వామ్యం కూడా ఉన్నది. సీఎం రేఖా గుప్తా భర్త పేరు మనిష్ గుప్తా. తన వద్ద ఎటువంటి వాహనం లేదని ఆమె తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక సుమారు 18 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు చెప్పారు.
మనీష్ గుప్తా ఆదాయ వివరాలను కూడా వెల్లడించారు. 2023-24 సంవత్సరానికి ఆయన ఆదాయం 97 లక్షలు. స్థిర ఆస్తి విలువ 30 లక్షలు కాగా, మూవెబుల్ అసెట్స్ సుమారు 1.14 కోట్లు ఉన్నట్లు తెలిపారు.