Lalbaug Ganapati : దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలో 10 రోజులపాటు ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు. ముంబైలో కొలువుదీరే గణనాథులలో లాల్బాగ్చా రాజా (లాల్బాగ్ గణపతి) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. లాల్బాగ్ వినాయకుడిని చూసేందుకు మనదేశం నుంచే గాక ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
సెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశుడిని లాల్బాగ్చా రాజా అని కూడా పిలుస్తుంటారు. ఉత్సవాల సమయంలో లాల్ బాగ్ ప్రాంతమంతా భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. గణనాథుడి దర్శనం కోసం భక్తులు క్యూ కడుతుంటారు. లాల్‌బాగ్‌లో ప్రతిష్ఠించే విఘ్నహర్త గణేశుడి విగ్రహాన్ని నవశాచ గణపతి అంటారు. ఈ రూపం భక్తుల సమస్త కోరికలను తీరుస్తుందని నమ్మకం.
లాల్‌బాగ్‌లో నిర్వహించే 10 రోజుల గణేశ ఉత్సవంలో ప్రతిరోజూ లక్షల మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలి వస్తుంటారు. ఈ 20 అడుగుల ఎత్తయిన విఘ్నహర్త విగ్రహాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. గత 89 ఏళ్లుగా ఈ అందమైన గణపతి బప్పా విగ్రహాన్ని రూపొందించే బాధ్యతను కాంబ్లీ కుటుంబం పర్యవేక్షిస్తున్నది. ఇక్కడి వినాయకుడు సింహాసనంపై మహరాజులా ఆసీనుడై ఉంటాడు.
లాల్బాగ్ గణపతిని కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలవారు దర్శించుకుని, ఆశీస్సులు పొందుతారు. బాలీవుడ్ ప్రముఖులు, పెద్దపెద్ద రాజకీయ నాయకులు, ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు, పలువురు బడా వ్యాపారవేత్తలు లాల్బాగ్చా రాజా ఆశీర్వాదం కోసం వస్తారు.