చెన్నై, జనవరి 31: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమిళనాడులో ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తేల్చిచెప్పారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ నేత శాంతనూ ఠాకూర్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం స్టాలిన్ సోషల్ మీడియా ఎక్స్‌లో స్పందించారు. ‘పౌరసత్వ సవరణ చట్టం వివక్షపూరితంగా ఉన్నది. ముస్లింలు, శ్రీలంక తమిళుల గురించి పట్టించుకోకుండా ఈ చట్టాన్ని రూపొందించారు. పార్లమెంట్లో దీనికి అనుకూలంగా ప్రతిపక్ష అన్నాడీఎంకే ఓటు వేసింది. పక్షపాత వైఖరితో కూడిన ఈ చట్టాన్ని తమిళనాడులో అసలు అమలు చేయబోం’ అని స్పష్టంచేశారు.