బెంగళూరు ఆగస్టు 22 : కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రార్థనా గీతాన్ని ఆలపించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అలజడి సృష్టించారు. బీజేపీ సభ్యులతో తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఉదంతం రాష్ట్రంలో భవిష్యత్ పరిణామాలకు సూచనగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన ఘటనపై బీజేపీ సభ్యుడు ఆర్ అశోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. దీనిపై శివకుమార్ స్పందిస్తూ బీజేపీ వ్యూహాల గురించి తనకు చాలా బాగా తెలుసునంటూ వ్యాఖ్యానిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతం నమస్తే సదా వత్సలే మాతృభూమేలోని రెండు పంక్తులు చదివారు. రాజకీయ పునరేకీకరణను డీకే సూచిస్తున్నారా అని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హెచ్చరికగా కొందరు భావిస్తున్నారు.