DK Shivakumar | కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వార్తలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెక్ పెట్టారు. డీకే శివకుమార్‌తో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్లు తానే కర్నాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎవరికి సందేహాలున్నాయని ప్రశ్నించారు. సీఎం మార్పుపై ప్రతిపక్ష పార్టీ బీజేపీ, జేడీఎస్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. వారంతా పార్టీ అధిష్టానమా? ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ తనకు మరో ఆప్షన్ లేదని వ్యాఖ్యానించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎవరికీ అడగలేదని.. నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటనలు చేసే నాయకులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
అందరూ కష్టపడి పని చేశారని, తనలాంటి లక్షలాది మంది కార్యకర్తలు పని చేశారని.. మనం మొదట వారి గురించి ఆలోచించాలన్నారు. సిద్ధ రామయ్యకు మద్దతు ఇవ్వడం తప్ప తనకు ‘వేరే మార్గం’ లేదని తెలిపారు. ‘నా దగ్గర ఏ ఆప్షన్ ఉంది? నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పార్టీ హైకమాండ్ ఏం చెప్పినా.. ఏం నిర్ణయించినా అదే జరుగుతుంది. నేను ఇప్పుడు ఏం చర్చించాలనుకోవడం లేదు. లక్షలాది మంది కార్యకర్తలు ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నారు’ అంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ సిద్ధరామయ్య నాయకుడిగా ఉండడం పార్టీలో ‘ఎలాంటి అసంతృప్తి’ లేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అయితే, ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రిని మార్చబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు బలాన్ని చేకూర్చాయి.