DK Shivakumar : కర్నాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తూ భంగపడుతున్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) రాజీనామా వదంతులకు చెక్ పెట్టారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను రాజీనామా చేయడం లేదని ఆయన తెలిపారు. క్యాబినెట్లో మార్పులు చోటుచేసుకోనున్న వేళ ఆదివారం అధిష్ఠానం పెద్దలను కలిసిన శివకుమార్ తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినని, ఎప్పటిలానే క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేస్తానని అన్నారు.
డిసెంబర్ 8న కర్నాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ లోపు క్యాబినెట్లో మార్పులు చేసేందుకు సీఎం సిద్ధరామయ్య సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
I have pledged to build 100 Congress offices. I am Congressi by blood and I will give my life for Congress with all my heart & soul.
— DK Shivakumar 🔥pic.twitter.com/RT3Tdwe4JZ
— Ankit Mayank (@mr_mayank) November 16, 2025
‘నా మానసిక, శారీరక, రాజకీయ ఆరోగ్యం భేషుగ్గా ఉంది. నేను రాజీనామా చేయడం లేదు. మంత్రివర్గ విస్తరణ అనేది సీఎం చూసుకుంటారు. ఆయన అధిష్ఠానాన్ని సంప్రందించి నిర్ణయం తీసుకుంటారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు నన్ను పిలిచినప్పుడు వెళ్తా. పార్టీ నాకు బాధ్యతలు అప్పగించినంతకాలం పనిచేస్తాను. క్రమశిక్షణ ఉన్న సైనికుడిలా పనిచేస్తా. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయను. ఎందుకంటే కర్నాటకలో ఈ పార్టీని నేను రాత్రీపగలు కష్టపడి నిర్మించాను. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు గురించి సిద్ధరామయ్య, అధిష్ఠానం, నా మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదు’ అని శివకుమార్ చెప్పారు.