DK Shivakumar | బెంగళూరు, ఏప్రిల్ 6 : కర్ణాటక కాంగ్రెస్‌లో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని వీడేందుకు డీకే శివకుమార్ ససేమిరా అన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. రెండు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఢిల్లీ పర్యటనలో శివకుమార్‌తో పాటు సీఎం సిద్ధరామయ్య ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ పెద్దలను కలిసినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా తనకు సీఎం పీఠం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కేపీసీసీ అధ్యక్ష పదవిని వీడేది లేదని అధిష్ఠానానికి డీకే స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది చివర్లో జరగనున్న జిల్లా పరిషత్, తాలూకా పంచాయతీల ఎన్నికలు ముగిసే వరకు కేపీసీసీ నాయకత్వ మార్పు లేనట్టేనని సీఎం సిద్ధరామయ్యకు, అతని వర్గం మంత్రులకు ఏఐసీసీ పెద్దలు తెలియజేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకేకు పొడిగింపు ఇవ్వనున్నట్టు పరోక్షంగా సిద్ధరామయ్య, మంత్రులకు ఢిల్లీ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.
డీకేను కేపీసీసీ పదవి నుంచి తప్పించాలని పలువురు మంత్రులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సీఎం పీఠానికి పోటీగా మారిన డీకేకు చెక్ పెట్టేందుకు సిద్ధరామయ్య వారికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్టు సమాచారం. సిద్ధరామయ్యకు సన్నిహితుడైన మంత్రి కేఎన్ రాజన్న ‘ఒక వ్యక్తి-ఒక పదవి’ అనే పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అయితే, హనీట్రాప్ వివాదంలో చిక్కుకోవడంతో రాజన్న ఈ మధ్య కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. ఈ పదవిని ఆశిస్తున్న మంత్రి సతీశ్ జార్ఖిహోళి కూడా బాహాటంగా మీడియాతో కేపీసీసీ అధ్యక్ష మార్పు గురించి మాట్లాడుతున్నారు. అయితే, కేపీసీసీ అధ్యక్ష పదవిని వదులుకునేందుకు డీకే సుముఖంగా లేరని తెలుస్తున్నది. మొదటి నుంచి తాను ఆశిస్తున్న సీఎం పీఠం దక్కక, ఉన్న పదవి కూడా ఊడిపోతే పార్టీలో, ప్రభుత్వంలో తన పరపతి తగ్గిపోతుందని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.