Chhattisgarh High Court | రాయ్‌పూర్, మే 20: వివాహేతర సంబంధం కారణాలతో విడాకులు పొందిన మహిళ భరణాన్ని పొందేందుకు అనర్హురాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ మహిళకు నెలకు రూ.4 వేల భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును, తన భరణం మొత్తాన్ని పెంచాలంటూ భార్య చేసిన విజ్ఞప్తిని హైకోర్టు కొట్టివేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125(4) ప్రకారం వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు భరణం పొందే హక్కు లేదని జస్టిస్ అరవింద్ కుమార్ వర్మ మే 9న ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌కు చెందిన ఒక జంటకు 2019లో హిందూ సంప్రదాయ ప్రకారం వివాహమైంది.
అయితే భర్త తనను శారీరక, మానసిక హింస పెడుతున్నాడని ఆరోపిస్తూ 2021 మార్చిలో భార్య అత్తింటిని వదిలి వెళ్లిపోయింది. భరణం కోసం రాయ్‌పూర్ ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది. అయితే ఆమె తన తమ్ముడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తున్నదని, ఆమె నుంచి తనకు విడాకులు కావాలంటూ భర్త కేసు పెట్టారు. 2023, సెప్టెంబర్ 8న ఫ్యామిలీ కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది. తర్వాత నెలకు ఆమెకు రూ.4 వేలు భరణం కింద చెల్లించాలంటూ నవంబర్ 6న ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆ భరణాన్ని 20 వేలకు పెంచాలంటూ ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు.