SWAT commando murder : భర్త చేతిలో గాయపడి మరణించిన స్వాట్ కమాండో కాజల్ చౌదరి హత్య ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కాజల్‌ను హత్య చేస్తున్న విషయాన్ని భర్త అంకుర్.. ఆమె సోదరుడికి ఫోన్లో చెప్పాడు. తనను చంపేస్తున్నానని, కావాలంటే ఆమె ఏడుపులు వినాలని చెప్పాడు. ఈ విషయాన్ని కాజల్ సోదరుడు నిఖిల్ మీడియాకు వెల్లడించాడు. ఢిల్లీ పరిధిలో క్లర్కుగా పని చేస్తున్న అంకుర్.. అక్కడే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అయిన స్వాట్ కమాండోగా పని చేస్తున్న కాజల్ చౌదరికి 2023లో వివాహం జరిగింది.
ఇద్దరూ ఘజియాబాద్ పరిధిలో ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మరోవైపు కాజల్‌ను కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా ఈ నెల 22న గొడవ జరిగింది. ఈ సమయంలో అంకర్.. గర్భిణిగా ఉన్న తన భార్య కాజల్‌ను డంబెల్‌తో కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కాజల్ ఘజియాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత.. అంటే ఈ నెల 27న మరణించింది. అయితే, గొడవ సందర్భంగా కాజల్.. తన సోదరుడు నిఖిల్‌కు ఫోన్ చేసింది. తన భర్త కొడుతున్నాడని ఫోన్లో చెప్పింది. వెంటనే ఆమె దగ్గరి నుంచి ఫోన్ తీసుకున్న అంకుర్.. తన మాటలు రికార్డ్ చేసుకోమని చెప్పాడు. తను ఆమెను చంపబోతున్నానని, పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుందని చెప్పినట్లు నిఖిల్ చెప్పాడు. ఫోన్లో తన సోదరి ఏడుపులు విన్నట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు.
కొంతసేపటి తర్వాత తనకు మరో కాల్ వచ్చిందన్నాడు. కాజల్ చనిపోయిందని, ఘజియాబాద్ ఆస్పత్రికి వచ్చి చూసుకోమని అంకుర్ ఫోన్లో చెప్పాడని నిఖిల్ వెల్లడించాడు. తను పోలీసులతో కలిసి ఆస్పత్రికి వెళ్లేసరికి, అతడితోపాటు కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. కాజల్‌కు అక్కడే చికిత్స అందించినప్పటికీ.. ఐదు రోజుల తర్వాత మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. అంకుర్, అతడి కుటుంబం తమ కుమార్తెను దారుణంగా వేధించేవారని, గర్భిణి అయినప్పటికీ ఇంటి పనులు మొత్తం చేయించుకునేవారని కాజల్ తల్లి చెప్పింది. గతంలో పలుసార్లు దాడి కూడా చేశాడని తెలిపింది.